Telangana Rashtra Samithi: 2023 తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పీకే సేవలు?
- ఒప్పందంపై కసరత్తు
- పీకేతో కేసీఆర్, కేటీఆర్ చర్చలు
- మూడో విడత అధికారంపై టీఆర్ఎస్ ఆశలు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సేవలతో ముచ్చటగా మూడోసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భావిస్తోంది. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) చీఫ్ ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా నిర్వహించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా సానుభూతి ఓట్లతో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగడాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. దీంతో 2018 డిసెంబర్ ఎన్నికల్లోనూ గెలుపు నల్లేరుపై నడకలానే సాగిపోయింది. కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనిపించింది. ఇదే సమయంలో మరోవైపు బీజేపీ క్రమంగా బలపడుతోంది.
ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటోంది. కేంద్రంలో బీజేపీ దగ్గర్నుంచి, ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పీకే సేవలు అందించారు. ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. కనుక పీకే సేవలతో మూడో విడత అధికారాన్ని దక్కించుకోగలమన్న విశ్వాసంతో టీఆర్ఎస్ ఉంది.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ పీకేతో చర్చించగా, ఎన్నికల్లో సేవలకు సంబంధించి ఒప్పందంపై కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో వైసీపీ, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు పీకే సేవలు ఫలితాలనివ్వడం తెలిసిందే.