Andhra Pradesh: టికెట్ల ధరల పెంపుపై చిత్ర పరిశ్రమ హర్షించేలా త్వరలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం: తెలుగు ఫిల్మ్ చాంబర్

Soon AP government deliver good news says Telugu film Chamber

  • మూడు గంటలపాటు సమావేశమైన విశ్వజిత్ ఆధ్వర్యంలోని కమిటీ
  • బెనిఫిట్ షోలపై జరగని చర్చ
  • సినీ పరిశ్రమ మేలు కోసమే చిరంజీవి, రాంగోపాల్ వర్మ చర్చలు
  • ఏసీ, నాన్ ఏసీ థియేటర్లకు అనుగుణంగానే టికెట్ ధరలు ఉండాలని కోరామన్న ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని తెలుగు ఫిల్మ్ చాంబర్ తెలిపింది. సినిమా టికెట్ల ధరల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఆధ్వర్యంలోని కమిటీ నిన్న సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. అన్ని సెంటర్లలోనూ టికెట్ ధరలు పెంచాలని కోరామని అయితే, బెనిఫిట్ షోలపై మాత్రం చర్చ జరగలేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ తెలిపారు.

చిరంజీవి, రాంగోపాల్ వర్మ ఎవరు చర్చించినా అది సినీ పరిశ్రమ మేలుకోసమేనని అన్నారు. ఎగ్జిబిటర్ల ప్రతినిధి బాలరత్నం మాట్లాడుతూ.. మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలను గతంలో ఎక్కువ ధరకు అమ్మి ఉండవచ్చని, కానీ ఇప్పుడలాంటి పరిస్థితి లేదని అన్నారు.

అధికారులందరూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, త్వరలోనే మంచి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్టు సెన్సార్ బోర్డు సభ్యుడు ఓం ప్రకాశ్ అన్నారు. ఏసీ, నాన్ ఏసీ థియేటర్లకు అనుగుణంగా టికెట్ల ధరలు నిర్ణయించాలని కమిటీని కోరినట్టు డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధి రాంప్రసాద్ తెలిపారు. 

  • Loading...

More Telugu News