Amaravati: ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని.. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే!: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
- జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
- ఏపీ రాజధాని ఏదని ప్రశ్న
- 3 రాజధానులపై ఏపీ సర్కారు వెనక్కి తగ్గినట్టు తమ దృష్టికి వచ్చిందన్న కేంద్రం
- రాజ్యసభలో నిత్యానందరాయ్ సమాధానం
ఇంతకీ ఏపీ రాజధాని ఏదని, ఆ విషయాన్ని నిర్ణయించే అధికారం ఎవరిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. రాజధానిపై గందరగోళం నెలకొని ఉందని.. స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం దానిపై సమాధానం చెప్పింది. ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తమ దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అని వ్యాఖ్యానించారు. ఏపీలో మూడు రాజధానులపై ఏపీ సర్కారు వెనక్కితగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. కాగా, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కొన్ని నెలలుగా రాజధాని రైతులు ఉద్యమం చేస్తోన్న విషయం తెలిసిందే.