IPL 2022: ఐపీఎల్ మెగా వేలంలో అత్యంత పిన్న, పెద్ద వయస్కులైన భారత క్రికెటర్లు వీరే!
- అత్యంత పిన్న వయస్కుడిగా నాగాలాండ్ లెగ్‌స్పిన్నర్
- అత్యంత పెద్ద వయస్కుడు అమిత్ మిశ్రా
- ఐపీఎల్‌లో 166 వికెట్లతో మిశ్రా రికార్డ్
ఐపీఎల్ సమరానికి రెడీ అవుతున్న బీసీసీఐ నిన్న మెగావేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 590 మంది పేర్లున్న ఈ జాబితాలో 370 మంది ఇండియన్ క్రికెటర్లు ఉన్నారు. ఈనెల 12, 13వ తేదీల్లో బెంగళూరులో వేలం జరగనుంది. ఇక మొత్తం ఆటగాళ్లలో 228 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు. అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఏడుగురు ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధవన్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితరుల కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఈ సారి మొత్తం 10 ఫ్రాంచైజీలు.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, టీమ్ అహ్మదాబాద్ వేలంలో పాల్గొంటున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ వేలంలో పాల్గొంటున్న వారిలో నాగాలాండ్ లెగ్ స్పిన్నర్ ఖ్రీవిట్సో కెన్సే అత్యంత పిన్న వయస్కుడు. అతని వయసు 17 ఏళ్లు. అత్యంత పెద్ద వయస్కుడు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. వయసు 39 సంవత్సరాలు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో బౌలర్ మిశ్రానే. మొత్తం 166 వికెట్లు సాధించాడు.