AP Employess: చీఫ్ సెక్రటరీపై విమర్శలు గుప్పించిన ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
- రెప్రజెంటేషన్ ఇవ్వడానికి నలుగురు నేతలం వెళ్లాం
- మా కోసం సీఎస్ ఒక్క నిమిషం సమయాన్ని కూడా కేటాయించలేదు
- మర్యాద కోసమైనా కూర్చోమని అనలేదు
ఈరోజు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తమను అవమానించారని మండిపడ్డారు. ఉద్యోగుల తరపున రెప్రజెంటేషన్ ఇవ్వడానికి నలుగురం జేఏసీ నేతలం వెళ్లామని... అయితే, తమకు ఆయన ఒక్క నిమిషం సమయాన్ని కూడా కేటాయించలేదని విమర్శించారు. మర్యాద కోసమైనా కూర్చోమని అనలేదని అన్నారు.
నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్పారని... దానికి విరుద్ధంగా ఈరోజు వ్యవహరించారని చెప్పారు. ఆర్థికశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని సూర్యనారాయణ విమర్శించారు. అధికారులపై ఫిర్యాదు చేసే అధికారం ఈ దేశ పౌరుడిగా తనకు ఉందని అన్నారు. అధికారుల శైలి ఇలాగే ఉంటే కేంద్ర డీఓపీటీకి కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.