AP Govt: చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు అధికారికంగా లేఖ రాసిన ఏపీ సర్కారు
- డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న ఉద్యోగులు
- ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తే స్పందిస్తామని వెల్లడి
- ఉద్యోగ సంఘాలకు లేఖ పంపిన జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ
- రేపు మధ్యాహ్నం సచివాలయంలో భేటీ
ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఇబ్బందికర వాతావరణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు అధికారికంగా లేఖ రాసింది.
సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగ సంఘాలకు లేఖ పంపారు. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులకు ఆహ్వానం పలికారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశం ఉంటుందని ఆ లేఖలో తెలిపారు.