KTR: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్
- ఏడున్నరేళ్లలో ఎలాంటి సాయం అందలేదు
- నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం?
- ఈ బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలన్న కేటీఆర్
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన నిలదీశారు.
ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు. కేంద్ర సర్కారు సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన చెప్పారు. డిమాండ్లను సాధించుకునేందుకు కేంద్ర సర్కారుపై పోరాటం చేస్తామని తెలిపారు.