COVID19: కరోనా వచ్చి తగ్గాక పాడైపోతున్న ఊపిరితిత్తులు.. సీటీ స్కాన్లు, ఎక్స్ రేల్లోనూ తేలని వైనం!
- బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- పలువురు పేషెంట్లు, ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధన
- జీనాన్ గ్యాస్ స్కాన్లలో కరోనా బాధితుల లంగ్స్ పాడైనట్టు గుర్తింపు
దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడిన వారిలో ఊపిరితిత్తుల్లో తీవ్రమైన సమస్యలు వేధిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన వారితో పోలిస్తే కరోనా పేషెంట్లలో ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. ఇటీవల బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ , షెఫీల్డ్, కార్డిఫ్, మాంచెస్టర్ యూనివర్సిటీల పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన పైలెట్ అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు, కరోనా పేషెంట్ల ఊపిరితిత్తులను జీనాన్ గ్యాస్ స్కాన్, ఇతర లంగ్ ఫంక్షన్ టెస్టుల ద్వారా పరీక్షించారు.
కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరనివారు, కరోనాతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకున్న వారు, కరోనా సోకని వారిపై ఈ ప్రయోగం చేశారు. ముఖ్యంగా కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరని వారిపై శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి సారించారు. పరిశోధనలో భాగంగా అందరికీ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) స్కాన్ చేశారు. స్కాన్ తీసేటప్పుడు జీనాన్ గ్యాస్ ను వారితో పీల్పించారు. స్కాన్లు చేసినప్పుడు ఈ గ్యాస్ ను కంటిద్వారా చూసేందుకు వీలవుతుంది.
ఈ క్రమంలోనే ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోలిస్తే దీర్ఘకాలిక కరోనా బారిన పడిన ఆసుపత్రిలో చేరని వారిలో జీనాన్ వాయువు అన్ని చోట్లకు వ్యాపించలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారిలోనూ అదే పరిస్థితి ఉందని నిర్ధారించారు. జీనాన్ గ్యాస్ ఊపిరితిత్తుల్లోని మొత్తం భాగానికి చేరలేదంటే అవి పాడైనట్టేనని పరిశోధనకు నేతృత్వం వహించిన ఊపిరితిత్తుల నిపుణురాలు డాక్టర్ ఎమిలీ ఫ్రేజర్ చెప్పారు. సీటీ స్కాన్లు, ఎక్స్ రేల్లో ఈ విషయం బయటపడడం లేదని ఆమె తెలిపారు.
ఇది జస్ట్ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన పరిశోధనేనని, లాంగ్ కొవిడ్ పేషెంట్లలో ఎంత మందికి ఈ సమస్యుందో తేల్చేందుకు భారీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని మరో సైంటిస్టు ప్రొఫెసర్ ఫెర్గ్యూస్ గ్లీషన్ చెప్పారు.