Rajampet: రాజంపేటలో భారీ ర్యాలీ.. హిందూపురంలో భజరంగ్ దళ్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం!
- అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజంపేటలో నిరసనలు
- ర్యాలీ చేపట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు
- శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలంటూ కొనసాగుతున్న బంద్ కార్యక్రమం
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇటీవల ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాల కేంద్రాలను మార్చాలంటూ కొన్నిచోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేటలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. వీరికి న్యాయవాదులు కూడా జతకలిశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు.
మరోవైపు హిందూపురంలో అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సులను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భజరంగ్ దళ్ కు చెందిన ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అతనిని అడ్డుకున్నారు.