Muttamsetti Srinivasa Rao: 26 జిల్లాలు వస్తున్నాయిగా.. మూడు రాజధానులూ అలానే వస్తాయి: ముత్తంశెట్టి
- జిల్లాల విభజనతో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువవుతాయి
- చంద్రబాబు తప్ప అందరూ స్వాగతించారు
- ఉద్యోగులు నా కుటుంబ సభ్యుల్లాంటివారు
- చర్చల ద్వారా పీఆర్సీ సమస్యకు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త జిల్లాలు ఎలా వస్తున్నాయో, మూడు రాజధానులు కూడా అలానే వస్తాయని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నిన్న విశాఖపట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మకమని అన్నారు. జిల్లాలను విభజించడం వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు.
జిల్లాల పునర్విభజనపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజనకు ఒక్క చంద్రబాబునాయుడు తప్ప అందరూ అనుకూలంగానే ఉన్నారని పేర్కొన్నారు.
కొత్త పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు తన కుటుంబ సభ్యుల లాంటివారని అన్నారు. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.