CM Jagan: ఆలిండియా సర్వీస్ నిబంధనల సవరణపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
- అధికారుల డిప్యుటేషన్ పై సవరణలు
- రాష్ట్రాల నుంచి సలహాలు కోరుతున్న కేంద్రం
- ఇప్పటికే లేఖలు రాసిన పలు రాష్ట్రాల సీఎంలు
- తాజాగా స్పందించిన సీఎం జగన్
ఉన్నతాధికారులకు సంబంధించి ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణలు చేపడుతున్న కేంద్రం రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు కోరడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ స్పందనలను కేంద్రానికి తెలియజేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఐఏఎస్ అధికారుల డిప్యుటేషన్ పై తమకు అభ్యంతరం లేదని, అయితే, ఏ అధికారులను పంపాలన్న అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే బాగుంటుందని సీఎం జగన్ సూచించారు. అధికారుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువగా తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే అధికారుల డిప్యుటేషన్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని వివరించారు.
ఉన్నతాధికారుల డిప్యుటేషన్ అనేది రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించని రీతిలో ఉండాలని అభిలషించారు. ఓ అధికారి కావాలని కేంద్రం కోరినప్పుడు, ఆ అధికారిని కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపిస్తే, రాష్ట్రంలో ఆ అధికారి చేపడుతున్న పథకాలన్నీ గాడితప్పుతాయని సీఎం జగన్ వివరించారు.
అంతేకాకుండా, ఆ అధికారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా డిప్యుటేషన్ నిర్ణయం తీసుకోవడం కూడా సబబు కాదని, వారి కుటుంబ పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీకి తెలిపారు. ఆ అధికారి సమర్థుడైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వదులుకోవడానికి ఇష్టపడదని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరణలు చేపడితే బాగుంటుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.