Brendan Taylor: జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై మూడున్నరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ

ICC imposed ban on Zimbabwe cricketer Brendan Taylor
  • ఇటీవల లేఖ రాసిన టేలర్
  • గతంలో తనను బుకీలు సంప్రదించారని వెల్లడి
  • బ్లాక్ మెయిల్ చేశారని వ్యాఖ్యలు
  • సకాలంలో టేలర్ సమాచారం ఇవ్వలేదన్న ఐసీసీ
స్పాట్ ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది. టేలర్ అంశంపై సమగ్ర విచారణ జరిపిన ఐసీసీ అతడిపై మూడున్నరేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని తెలిపింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించాడని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన సంగతులు వెల్లడించడం తెలిసిందే. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు.

అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది.
Brendan Taylor
ICC
Ban
Spot Fixing
Zimbabwe

More Telugu News