Maharashtra Assembly: ఇది రాజ్యాంగ విరుద్ధం.. మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు
- సస్పెన్షన్ నాటి సమావేశాలకే పరిమితం
- ఏడాది సస్పెన్షన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్న ఫడ్నవిస్
మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేయడాన్ని రాజ్యంగ విరుద్ధమైన, ఏకపక్ష చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అసెంబ్లీలో బీజేపీ సభ్యులు నిరసన, రాద్ధాంతం చేసినందుకు.. ఏడాది పాటు 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నాటి సభాధ్యక్ష స్థానంలో ఉన్న భాస్కర్ జాదవ్ ప్రకటించారు.
దీనిపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు సస్పెన్షన్ ను నాటి వర్షాకాల సీజన్ సమావేశాలకే (2021 జూలై) పరిమితం చేయాలని ఆదేశించింది. ఏడాది కాల సస్పెన్షన్ ను కొట్టివేసింది.
నాడు సభను వాయిదా వేసిన తర్వాత బీజేపీ సభ్యులు తన క్యాబిన్ కు వచ్చి, ప్రతిపక్ష నేత సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్టు స్పీకర్ జాదవ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ సభ్యుల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం, అధికార దుర్వినియోగం అని తేలిపోయినట్టు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.