COVID19: ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. పాఠశాలల పున:ప్రారంభంపై హైకోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కారు
- వారాంతపు సంతల్లో నియంత్రణ చర్యలపై ప్రశ్నించిన ధర్మాసనం
- సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
- పిల్లల మందులు మెడికల్ కిట్లలో ఇవ్వలేమన్న డీహెచ్
రాష్ట్రంలో పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. కరోనా కేసుల నియంత్రణపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ నెల 31 నుంచి స్కూళ్లను తెరుస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. వారాంతపు సంతల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ సర్కారును ఆదేశించింది. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశాలిచ్చింది.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆన్ లైన్ లో విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వేలో 3.45 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేశామని హైకోర్టుకు నివేదించారు. పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. పిల్లలకు సంబంధించిన మందులను కిట్లలో నేరుగా ఇవ్వడానికి లేదని చెప్పారు. అయితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.