Greg Chappell: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఒకడుండాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్

Greg Chappell points out one quality of MS Dhoni

  • అత్యంత చురుకైన క్రికెట్ బుర్రల్లో ధోనీది ఒకటి
  • సహజ వాతావరణ పరిస్థితుల్లో నేర్చుకోవడం తగ్గిపోతోంది
  • యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ పరాభవానికి కారణాల్లో ఇదొకటి

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి జట్టులోనూ ధోనీలాంటోడు ఒకడు ఉండాలని అన్నాడు. సహజ వాతావరణంలో క్రికెట్ నేర్చుకున్న వాళ్లే ఎక్కువ కాలం మనగలుగుతారని, అలాంటి వాళ్లలో ధోనీ ఒకడని కితాబునిచ్చాడు. అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు క్రమంగా సహజ వాతావరణాన్ని కోల్పోతున్నాయని చాపెల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

యువ క్రికెటర్లు ఎదిగేది సహజ వాతావరణం నుంచేనని, వారు ఆటగాళ్లను చూస్తూ, కుటుంబ సభ్యులు, క్రికెటర్లతో సరదాగా గడుపుతూ ఆట నేర్చుకుంటారని అన్నాడు. భారత్‌లో మాత్రమే ఇలాంటి వాతావరణం ఉందని, అక్కడి చిన్నపట్టణాల్లో సౌకర్యాలు చాలా తక్కువని చాపెల్ గుర్తు చేశాడు. అక్కడి వీధుల్లో, ఖాళీగా ఉండే పొలాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడుతుంటారని, సంప్రదాయ కోచింగ్ పద్ధతుల్ని వీరు పాటించరని పేర్కొన్నాడు. ప్రస్తుత స్టార్లు అలా వచ్చినవారేనని, వారిలో ధోనీ ఒకడని అన్నాడు.

ప్రతిభ, శైలి ధోనీ తనకు తానుగా తెచ్చుకున్నాడని, జట్టులోకి వచ్చాక సీనియర్ల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకుని తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడని ప్రశంసించాడు. తనకు తెలిసినంత వరకు అత్యంత చురుకైన క్రికెట్ బుర్రల్లో ధోనీది ఒకటని అన్నాడు. ప్రతి జట్టులోనూ ఇలాంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండాలన్నాడు. ఇలాంటి వారు తగ్గిపోతుండడం వల్లే జట్లు ఇబ్బంది పడుతున్నాయని వివరించాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ఓటమికి గల కారణాల్లో  ఇది కూడా ఒకటని చాపెల్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News