Ashok Babu: టైపింగ్ మిస్టేక్ ను ప్రత్యర్థులు అలుసుగా తీసుకున్నారు.. ఇంతకు ముందే దీనిపై విచారణ జరిగింది: అశోక్ బాబు
- టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు
- డీకామ్ అనేది పొరపాటున బీకామ్ గా టైప్ అయింది
- ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు
టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ బాబు స్పందిస్తూ... తనపై కేసు నమోదయినట్టు కథనాలు వస్తున్నాయని, ఇది పాత విషయమని చెప్పారు. ఉద్యోగుల సంఘంలో తాను ఉన్నప్పుడు తన ప్రత్యర్థులు చేసిన ప్రయత్నమే ఈ కేసు అని తెలిపారు. చిన్న టైపోగ్రాఫిక్ మిస్టేక్ వల్ల నేరంగా పరిగణిస్తున్నారని చెప్పారు. పొరపాటున డీకామ్ (డిప్లొమా ఇన్ కంప్యూటర్స్) అనేది బీకామ్ గా తప్పుగా టైప్ అయిందని... దీన్ని అలుసుగా తీసుకుని తన ప్రత్యర్థులు తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు.
2019లోనే దీనిపై డిపార్ట్ మెంటల్ విచారణ జరిగిందని... నేరపూరితంగా ఈ పని జరగలేదని, దీని వల్ల అదనంగా ఎలాంటి బెనిఫిట్స్ ఏమీ లేవని విచారణాధికారి రిపోర్ట్ ఇచ్చారని అశోక్ బాబు చెప్పారు. టెక్నికల్ మిస్టేక్ వల్ల జరిగిన దానికి పనిష్మెంట్ అవసరం లేదని రిపోర్ట్ లో పేర్కొన్నారని తెలిపారు. ఉద్యోగ సంఘంలో వైరంతో పాటు తాను టీడీపీ ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేని వారు లోకాయుక్తకు ఒక ఉద్యోగితో ఫిర్యాదు చేయించారని చెప్పారు.
రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్రకు పాల్పడుతున్నారని అశోక్ బాబు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా పోరాడుతానని చెప్పారు. తనపై సీబీఐ చేత విచారణ జరిపించుకోవచ్చని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. 2019లో ముగిసిపోయిన ఈ అంశంపై లోకాయుక్త ముందుగా నోటీసు ఇచ్చి సంజాయషీ తీసుకోవాలని అన్నారు.