Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ పోలీసుల ఆంక్షలు!
- రిపబ్లిక్ డే ఉత్సవాలకు సర్వం సిద్ధం
- కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు విధించిన పోలీసులు
- 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి నిరాకరణ
రేపు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు మాస్కులు కచ్చితంగా ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అంతేకాదు గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని తెలిపారు. 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను పరేడ్ కు అనుమతించబోమని చెప్పారు.
రిపబ్లిక్ డే ఉత్సవాలకు వచ్చే వీక్షకుల సీటింగ్ బ్లాకులు ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతాయి. వీక్షకులందరూ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. వాహనాల పార్కింగ్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది. సొంత వాహనాల్లో కాకుండా ట్యాక్సీ లేదా కార్ పూలింగ్ పద్ధతిలో వస్తే బాగుంటుందని పోలీసులు సూచించారు. సెక్యూరిటీ చెక్ కోసం ప్రతి ఒక్కరూ ఐడీ కార్డును తెచ్చుకోవాలి.
రిపబ్లిక్ డే పరేడ్ జరగనున్న మార్గం ఇదే. విజయ్ చౌక్ - రాజ్ పథ్ - అమర్ జవాన్ జ్యోతి - ఇండియా గేట్ - రౌండ్ అబౌట్ ప్రిన్సెస్ ప్యాలస్ - తిలక్ మార్గ్ గుండా నేషనల్ స్టేడియంలోకి పరేడ్ ప్రవేశిస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు పరేడ్ ముగిసే వరకు రాజ్ పథ్, విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ అనుమతించరు. రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి తిలక్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, సుభాష్ మార్గ్ లలో ట్రాఫిక్ ను అనుమతించరు. అయితే పరేడ్ సమయంలో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.