USA: ఏ క్షణాన అయినా ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడే అవకాశం... జాగ్రత్తపడుతున్న అగ్రరాజ్యాలు

US and Britain set to withdraw staff form Ukraine as Russia mounts war fears

  • రష్యా, ఉక్రెయిన్ మధ్య భద్రతాపరమైన సంక్షోభం
  • ఉక్రెయిన్ సరిహద్దుకు భారీగా దళాలను తరలించిన రష్యా
  • తమ దౌత్య సిబ్బందిని ఖాళీ చేయిస్తున్న అమెరికా, బ్రిటన్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కొంతకాలంగా ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు రష్యా భారీగా బలగాలను తరలిస్తోంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య తొలిసారి భద్రతాపరంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇటీవల కాలంలో రష్యా దూకుడు మరింత పెంచింది. దాంతో ఏ క్షణాన అయినా రష్యా బలగాలు ఉక్రెయిన్ పై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్యాలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ లోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, అమెరికన్లు ఎవరూ ఇక్కడికి రావొద్దని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని అమెరికా రాయబార కార్యాలయం తమ దౌత్య సిబ్బంది కుటుంబాల తరలింపునకు సన్నద్ధమైంది.

అటు, బ్రిటన్ కూడా కీవ్ లోని తమ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేస్తోంది. తమ సిబ్బందిని సొంతగడ్డకు తరలిస్తోంది. రష్యా దాడికి సిద్ధమైందన్న స్పష్టమైన సమాచారంతో బ్రిటన్ ఆగమేఘాలపై స్పందించింది. ప్రస్తుతం సగానికి పైగా సిబ్బందిని, వారి కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

తనపై దాడికి నాటో దళాలు ఉక్రెయిన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉందన్న కారణంతోనే రష్యా యుద్ధానికి సన్నద్ధమవుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ పలు ఆయుధాలను ఉక్రెయిన్ కు తరలించడం చూస్తుంటే రష్యా భయాలు నిజమే అనిపించేలా ఉన్నాయి.

  • Loading...

More Telugu News