Anitha: జబర్దస్త్ నటి రోజా ఎందుకు స్పందించడం లేదు.. కేసినోను పేదలకు అందుబాటులోకి తెస్తారా?: టీడీపీ నాయకురాలు అనిత

Why Jabardast Roja not responding asks Anitha

  • ఏపీ పేరు చెపితే గుడివాడ.. అందులో కేసినో గుర్తు వస్తున్నాయి
  • కేసినోలోని టెంట్లన్నీ వైసీపీ రంగులోనే ఉన్నాయి
  • కేసినో నుంచి జగన్ కు, డీజీపీకి ఎంత వాటాలు వెళ్లాయి?

గుడివాడ కేసినో వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ, గోవా కల్చర్ తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి వైసీపీ నేతలు మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా కనీసం నోరు కూడా విప్పడం లేదని అన్నారు.

టీడీపీ హయాంలో విశాఖ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు నానా రచ్చ చేశారని... ఇప్పుడు కేసినో వ్యవహారంపై సుచరిత, జబర్దస్త్ నటి రోజా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా మౌనంగా ఉన్నారని విమర్శించారు.

మొన్నటి వరకు ఏపీ పేరు చెపితే గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని... ఇప్పుడు ఏపీ పేరు చెపితే గుడివాడ.. అందులో కేసినో గుర్తుకు వస్తున్నాయని అనిత ఎద్దేవా చేశారు. కేసినోలోని టెంట్లన్నీ వైసీపీ రంగుల్లోనే ఉన్నాయని.. అయినా దాంతో తనకు సంబంధం లేదని కొడాలి నాని అంటున్నారని దుయ్యబట్టారు.

సినిమా టికెట్ ను రూ. 10 చేశారని... కేసినో ఎంట్రీ టికెట్ మాత్రం రూ. 10 వేలు పెట్టారని అన్నారు. కేసినోను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తారా? అని ఎద్దేవా చేశారు. కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసినో నుంచి జగన్ కు, డీజీపీకి ఎంత వాటాలు వెళ్లాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని విమర్శించారు.

విశాఖ బీచ్ ఫెస్టివల్ పై అప్పట్లో చంద్రబాబు మాట్లాడుతూ, సంస్కృతిని నాశనం చేసే పనులను అంగీకరించబోమని అన్నారని అనిత గుర్తు చేశారు. ఇప్పుడు కేసినో గురించి ఇంత రచ్చ జరుగుతున్నా జగన్ మాత్రం మౌనంగానే ఉన్నారని విమర్శించారు.

Anitha
Chandrababu
Telugudesam
Jagan
Roja
Mekathoti Sucharitha
YSRCP
Kodali Nani
Casino
  • Loading...

More Telugu News