Virat Kohli: మా కుమార్తె ఫొటోలు ప్రసారం చేయవద్దు: కోహ్లీ రిక్వెస్ట్
- అనుకోకుండా కెమెరాకు చిక్కాం
- వామికా ఫొటోలు తీయవద్దు
- షేర్ కూడా చేయవద్దు
- ఎందుకో గతంలోనే వివరించాం
- ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీ పోస్ట్
క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ముద్దుల కుమార్తె వామిక ఫొటోలు మీడియాకు ఎక్కడం పట్ల స్టార్ క్రికెటర్ స్పందించాడు. దయచేసి వామిక ఫొటోలను ప్రసారం చేయవద్దంటూ కోహ్లీ ప్రత్యేకంగా కోరాడు.
కేప్ టౌన్ లో భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసిన వెంటనే అనుష్క తన తండ్రిని చూపిస్తూ చప్పట్లు కొట్టడాన్ని తెలివిగా ఎవరో కెమెరాలో బంధించేశారు. ఆ ఫొటోలే దాదాపు అన్ని మీడియా చానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా వేదికలపైకి చేరాయి.
దీంతో ఇన్నాళ్లు తమ కుమార్తె ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న కోహ్లీ దంపతుల గోప్యతకు భంగం కలిగింది. తమ కుమార్తె విషయంలో ప్రైవసీ కావాలని, దీన్ని అర్థం చేసుకుంటారని కోరుతూ గతంలో కోహ్లీ, అనుష్క కోరడం తెలిసిందే.
‘‘మా కుమార్తె (వామిక) ఫొటోలను ఆదివారం స్టేడియంలో ఉన్న సందర్భంగా తీసినట్టు గుర్తించాము. ఆ తర్వాత ఆ ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేశారు. మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది.. మేము కెమెరాకు చిక్కాము. కెమెరా మా వైపు ఉందని తెలియదు. ఈ అంశంలో (గోప్యత విషయమై) మా విధానం, అభ్యర్థనలో ఏ మార్పు లేదు. వామికా ఫొటోలను క్లిక్ చేయకుండా, ప్రచురించకుండా, షేర్ చేయకుండా ఉంటే ఎంతో సంతోషిస్తాం. ఎందుకన్నది గతంలోనే కారణాలు వివరించాము. ధన్యవాదాలు’’ అంటూ విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో కోరాడు.