APTF: కడుపు మంటతోనే ఆందోళన చేస్తున్నాం.. వైసీపీ లేఖకు వివరణ ఇదిగో: ఏపీటీఎఫ్

APTF gave Answers to ycp letter against employees

  • ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను పక్కదారి పట్టించేలా ఉంది
  • కొత్త పీఆర్సీతో జీతభత్యాల్లో కోతలు
  • ఎక్కడ నిరూపించేందుకైనా సిద్ధం
  • పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం మాకు వరం కాబోదు

వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన లేఖలో ఉన్నవన్నీ అసత్యాలేనని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) ఆరోపించింది. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఆందోళనను పక్కదారి పట్టించేలా అది ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీఆర్సీలో జీతభత్యాలు తగ్గడంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని, రాజకీయ పార్టీలు కానీ, మరొకరు కానీ తమను ప్రభావితం చేయలేదని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ప్రధాన కార్యదర్శి కులశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వైసీపీ వాదనకు వారు సమాధానాలు ఇచ్చారు.  

కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవమని, రూ. 10 కోట్లు అదనంగా ఇస్తున్నామని వైసీపీ వాదిస్తోందని, కానీ కొత్త పీఆర్సీతో జీతభత్యాల్లో విధించిన కోతలను ఏ వేదికమీదనైనా నిరూపించగలమని అన్నారు. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని అర్హులు కొందరికి జూన్ 30లోగా ఉద్యోగాలిస్తామని వైసీపీ చెబుతోందని, కానీ అలా మరణించిన ఉద్యోగులందరి కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. మరణంలోనూ వివక్ష చూపి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, అందులోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇస్తున్నారని పేర్కొన్నారు.

రూ. 12 లక్షలుగా ఉన్న గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచామన్న దానిపైనా ఏపీటీఎఫ్ వివరణ ఇచ్చింది. నిజానికి ఇది సీలింగ్ పరిమితి అని, పెంచాల్సింది రూ. 20 లక్షలకని స్పష్టం చేసింది. సవరించిన వేతనాల వల్ల ప్రతి ఉద్యోగి సగటున రూ. 2-4 లక్షలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై వివరణ ఇస్తూ.. లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే దీనిని వరంగా ఎలా భావిస్తామని పేర్కొంది. వీటితోపాటు వైసీపీ విడుదల చేసిన లేఖలోని మరెన్నింటికో ఏపీటీఎఫ్ వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News