COVID19: కరోనా ఇక ఎంతమాత్రమూ మహమ్మారిగా ఉండబోదు: ఐహెచ్ఎంఈ
- ఆరోగ్య వ్యవస్థలు చికిత్స చేయగలిగే సాధారణ అనారోగ్యంగా కొవిడ్
- టీకాల ద్వారా పెరిగే రోగ నిరోధకశక్తి క్షీణిస్తుంది కాబట్టి కేసులు మామూలే
- ప్రభుత్వాలు కూడా అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్న ఐహెచ్ఎంఈ
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ఇక ఎంతమాత్రమూ ‘మహమ్మారి’గా ఉండబోదని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) పేర్కొంది. మున్ముందు ఇది మన ఆరోగ్య వ్యవస్థలు చికిత్స చేయగలిగే సాధారణ అనారోగ్యంగా మారిపోతుందని తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ చీఫ్, అమెరికన్ ఫిజీషియన్ క్రిస్టఫర్ ముర్నే పేర్కొన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఒమిక్రాన్ వేవ్ తర్వాత కూడా కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉంటాయని, కాకపోతే ఇప్పుడు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వాలు అప్పుడు అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదని ముర్రే పేర్కొన్నారు. టీకాల వల్ల కానీ, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కానీ శరీరంలో పెరిగిన రోగ నిరోధకశక్తి కాలక్రమంలో తగ్గిపోతుందని, కాబట్టి కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. చలికాలంలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, కేసుల ప్రభావం మాత్రం చాలా స్వల్పమేనని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.