Zomato: జొమాటో, స్విగ్గీ చౌక కాదు గురూ.. ఆర్డర్ చేస్తే బాదుడే!

Zomato swiggy Sells Food For Much More Than The Restaurant Price

  • రెస్టారెంట్ ధర వేరు.. వీటి ధర వేరు!
  • 23 శాతం వరకు కమీషన్
  • డెలివరీ చార్జీ అదనం 
  • అన్నీ కలుపుకుంటే రేట్లు ఎక్కువే

స్విగ్గీ, జొమాటో సకాలంలో ఆకలి తీర్చే వేదికలుగా మారాయి. పట్టణాలలో వీటి సేవలను వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు వీటి ఆర్డర్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇవి భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ, పరిశీలించి చూస్తే ఈ ప్లాట్ ఫామ్ లపై ధరలు రెస్టారెంట్లతో పోలిస్తే ఎక్కువే.

జొమాటో ప్రతి ఆర్డర్ విలువపై 18-25 శాతం మధ్య కమీషన్ ను రెస్టారెంట్ నుంచి వసూలు చేస్తుంది. స్విగ్గీ కమీషన్ 18-23 శాతం మధ్య ఉంది. కస్టమర్ చేసిన ఆర్డర్ విలువ, రెస్టారెంట్ టైప్ ఆధారంగా కమీషన్ లో మార్పు ఉంటుంది. ఈ ధరపై 5 శాతం జీఎస్టీ అదనం. డెలివరీ చార్జీలు కూడా ఉంటాయి. సాధారణంగా 2 కిలోమీటర్ల దూరానికి రూ.40-50 మధ్య చార్జ్ చేస్తున్నాయి. దూరం పెరిగితే రూ.60 వరకు డెలివరీ కోసం భరించాల్సిందే.

ఇక అసలు విషయానికొస్తే, రెస్టారెంట్ లో రూ.120కు విక్రయించే బిర్యానీని.. అదే రెస్టారెంట్ స్విగ్గీ, జొమాటో వేదికగా విక్రయిస్తే కమీషన్ రూపంలో రూ.24 కంటే ఎక్కువే నష్టపోవాలి. కనుక వీటి కమీషన్ ను కలుపుకుని కొన్ని రెస్టారెంట్లు మెనూ ధరలను నిర్వహిస్తున్నాయి. దీంతో రెస్టారెంట్ లో రూ.120కు లభించే బిర్యానీ కోసం కస్టమర్.. రూ.24-30 వరకు ప్లాట్ ఫామ్ కమీషన్, డెలివరీ చార్జీ రూ.50 కలిపి చూస్తే రూ.180 వరకు సమర్పించుకోవాల్సి వస్తుంది. జీఎస్టీ అన్నది రెస్టారెంట్ కు వెళ్లి తిన్నా పడే భారమే.

ఆఫర్ల పేరుతో ఈ ప్లాట్ ఫామ్ లు కొంత డిస్కౌంట్ ఇస్తుండడంతో కమీషన్, డెలివరీ చార్జీల భారం పెద్దగా కస్టమర్ పై పడడం లేదు. కానీ, ఈ రెండు సంస్థలు మార్కెట్ ను విస్తరించుకునే క్రమంలో తాయిలాలు ఇస్తున్నాయి. ఒక్కసారి ఈ కార్యక్రమం ఒక స్థాయికి చేరుకుంటే డిస్కౌంట్లు ఎత్తివేయడం లేదా నామమాత్రంగా ఆఫర్ చేయడానికి మారిపోతాయి. అప్పుడు ఇంటి నుంచే మంచి టేస్టీ ఫుడ్ తినాలంటే అధికంగా ఖర్చు చేయక తప్పదు.

  • Loading...

More Telugu News