RT-PCR Kit: ఇంట్లోనే ఒమిక్రాన్ టెస్ట్.. 45 నిమిషాల్లోనే ఫలితం
- ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ‘క్రియా’
- ఐసీఎంఆర్ అనుమతి
- వారానికి 50 లక్షల కిట్‌ల ఉత్పత్తి
దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయితే, వైరస్‌లో చాలా రకాలు ఉండడంతో సోకింది ఏ రకమో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. వైద్యులు కూడా నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపితే తప్ప నిర్ధారించలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో గంటలోపే మనకు సోకింది ఏ రకమో తెలుసుకునేందుకు ఓ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఈ కిట్ పేరు ‘క్రివిడా నోవస్ కొవిడ్-19 టెస్టింగ్ కిట్’.
ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను తయారుచేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవవచ్చని క్రియా పేర్కొంది. తాము ఏ వేరియంట్ బారినపడ్డామో ఇది కచ్చితంగా చెప్పేస్తుందని తెలిపింది.
క్రియా అభివృద్ధి చేసిన ఈ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం కూడా లభించింది. చెన్నైలోని తమ ప్లాంట్‌లో వారానికి 50 లక్షల కిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని క్రియా మెడికల్ టెక్నాలజీస్ పేర్కొంది.