Novak Djokovic: ఫ్రాన్స్ లోనూ అదే రూల్... ఫ్రెంచ్ ఓపెన్ కు జకోవిచ్ కష్టమే!
- కరోనా వ్యాక్సిన్ తీసుకోని జకోవిచ్
- ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపిన అధికారులు
- ఫ్రాన్స్ లో కొత్త వ్యాక్సిన్ చట్టం
- వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపిస్తేనే అనుమతి
కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ను తమ భూభాగం నుంచి తిప్పి పంపడం తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు వచ్చిన జకోవిచ్ ను నిబంధనల మేరకు ఆస్ట్రేలియా వర్గాలు నిర్బంధించాయి. ఈ క్రమంలో అతడి వీసా రెండు పర్యాయాలు రద్దయింది. ఫెడరల్ కోర్టులోనూ జకోవిచ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాంతో అతడు స్వదేశం సెర్బియాకు తిరిగి వెళ్లాడు.
కాగా, ఫ్రాన్స్ లోనూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను తమ గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని ఫ్రాన్స్ వర్గాలు అంటున్నాయి. మే నెలలో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ జరగనుండగా, వ్యాక్సిన్ తీసుకోకపోతే జకోవిచ్ ను ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడనివ్వబోమని ఫ్రాన్స్ క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజాగా రూపొందించిన వ్యాక్సిన్ చట్టంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పింది. తాజా వ్యాక్సిన్ చట్టానికి ఫ్రాన్స్ పార్లమెంటు ఆదివారం నాడు ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఫ్రాన్స్ లో రెస్టారెంట్లు, కేఫ్ లు, సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాలు, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలోకి అనుమతించాలంటే, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించడం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తమ చట్టం ప్రకారం ప్రేక్షకుడికి అయినా, క్రీడాకారుడికి అయినా నిబంధనలు ఒకేలా వర్తిస్తాయని పేర్కొంది.