Adimulapu Suresh: స్కూళ్లు తెరవడానికి, కరోనా వ్యాప్తికి సంబంధం లేదు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
- కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా పరిస్థితి అదుపులోనే ఉంది
- ఇప్పటి వరకు 22 లక్షల మంది విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చాం
- ఆన్ లైన్ క్లాసులు ఒక స్థాయి వరకే పరిమితమన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవుల తర్వాత స్కూళ్లు మళ్లీ మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఈరోజు ఎంత మంది విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారనే రిపోర్టులను తెప్పించుకుంటున్నామని చెప్పారు.
విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. 90 శాతం మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు.
కరోనా వల్ల గత రెండేళ్లలో పరీక్షలను నిర్వహించలేకపోయామని మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరాన్ని కూడా ముందుగా అనుకున్న ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. టీచర్లకు వంద శాతం వ్యాక్సిన్ వేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని, స్కూళ్లను తెరవొద్దని విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని చెప్పారు. పక్కనున్న రాష్ట్రాలతో మనకు పోలిక అనవసరమని అన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలను విరివిగా నిర్వహిస్తామని చెప్పారు.
ఆన్ లైన్ విద్యాబోధన అనేది ఒక స్థాయి వరకే పరిమితమని మంత్రి చెప్పారు. ప్రత్యక్ష తరగతులకు ఆన్ లైన్ క్లాసులు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. స్కూళ్లను తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. పాఠశాలల్లో కరోనా కేసులు బయటపడితే శానిటైజేషన్ చేయిస్తామని తెలిపారు.