rain: తెలంగాణలో వర్షాలు.. సూర్యాపేటలో సహాయక చర్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశం
- సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం
- అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో సమీక్ష
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు వర్షం పడింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ఆ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మునిసిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో జగదీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. సహాయక సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.