Congress: 'సోనూ సూద్ చెల్లి అయినందుకే మాళవికకు సీటు ఇచ్చారు' అంటూ కాంగ్రెస్‌కి ఎమ్మెల్యే రాజీనామా
- ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సోనూ సోదరి మాళవిక
- మోగా స్థానం నుంచి పోటీ
- ఆ ప్రాంత ఎమ్మెల్యే అసంతృప్తి
- బీజేపీలో చేరిన వైనం
త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. దీంతో తనకు ఇవ్వాల్సిన సీటును మాళవికా సూద్‌కు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ ఆ పార్టీని వీడారు.
దీంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న హర్జోత్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడం తనను అవమానించడమేనని ఆయన చెప్పారు. తనను రాష్ట్రంలోని మరో నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని ఆయన తెలిపారు. తమ ప్రాంతానికి కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వచ్చినప్పుడు కూడా తమ ఇంటికి రాకుండా నేరుగా మాళవికా సూద్ ఇంటికి వెళ్లారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో మాళవిక సూద్ చేరడం పట్ల తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని, మోగా నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు సీటు ఇవ్వకపోవడం పట్లే తనకు బాధగా ఉందని ఆయన చెప్పారు. మాళవిక సూద్ తనకు సోదరి లాంటిదని, అయితే, ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవమూ లేదని తెలిపారు.
అయినప్పటికీ సోనూ సూద్ సోదరి అయిన కారణంగానే ఆమెకు సీటు ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను పార్టీలో చాలా కష్టపడ్డానని, యూత్ కాంగ్రెస్ వర్కర్‌గా తన ప్రస్థానం ప్రారంభించి పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశానని చెప్పారు. తాను 21 ఏళ్లుగా కాంగ్రెస్‌కు సేవలు చేశానని ఆయన తెలిపారు.