Novak Djokovic: మరోసారి ఆస్ట్రేలియా అధికారుల నిర్బంధంలోకి నొవాక్ జకోవిచ్

Novak Djokovic detained in Australia again

  • ఆస్ట్రేలియాలో జకోవిచ్ వీసా రగడ
  • వ్యాక్సిన్లు తీసుకోకుండా ఆస్ట్రేలియా వచ్చిన జకో
  • నిబంధనలు ఒప్పుకోవంటూ వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా
  • జకోవిచ్ కు అనుకూలంగా కోర్టు తీర్పు
  • ప్రత్యేక అధికారం ఉపయోగించిన మంత్రి
  • మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వచ్చిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ కు మరోసారి నిర్బంధం తప్పలేదు. జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండోసారి కూడా రద్దు చేయగా, అధికారులు అతడిని కరోనా నిర్బంధ కేంద్రానికి తరలించారు.

అసలు, జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడమే ఈ చర్యలకు కారణమైంది. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్లు తీసుకోని వారికి దేశంలో ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే ఓసారి జకోవిచ్ వీసాను రద్దు చేయగా, కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. అయితే, ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలెక్స్ హాక్ తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్ వీసాను రద్దు చేయడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ క్రమంలో అధికారులు జకోవిచ్ ను మెల్బోర్న్ లోని పార్క్ హోటల్ కు తరలించారు. ఈ హోటల్ ను కరోనా నిర్బంధ కేంద్రంగా వినియోగిస్తున్నారు.

కాగా ఈ వ్యవహారంపై సెర్బియా దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్నిస్ యోధుడ్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యానించారు. "జకోవిచ్ ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో 10వ టైటిల్ ను గెలనివ్వరాదని అనుకుంటున్నారా? అలాగైతే అతడి వీసా రద్దు చేసినప్పుడు ఎందుకు వెనక్కి పంపలేదు? ఈ విషయంలో జకోవిచ్ కు మేం అండగా ఉంటాం" అని ఉద్ఘాటించారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. కరోనా రక్కసిపై పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నో త్యాగాలు చేయడమే కాకుండా, సుదీర్ఘకాలంలో నిర్బంధంలో గడిపారని వెల్లడించారు. వ్యాక్సిన్లు తీసుకోని జకోవిచ్ ను అనుమతించడం ద్వారా ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయలేమని స్పష్టం చేశారు.

అటు, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ స్పందిస్తూ, జకోవిచ్ ను అనుమతిస్తే వ్యాక్సిన్లపై ప్రజల్లో వ్యతిరేక భావన బలపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశ పౌరుల్లో అనిశ్చితికి కారణమయ్యే ఏ అంశాన్నీ తాము ఉపేక్షించబోమని తెలిపారు. కాగా, జకోవిచ్ వీసా అంశంపై రేపు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో విచారణ జరగనుంది. హోటల్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జకోవిచ్ విచారణకు హాజరు కానున్నాడు.

Novak Djokovic
Detention
Visa
Australia
Tennis
Australian Open
  • Loading...

More Telugu News