Rajasthan: ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న యువతులు.. తామేమీ చేయలేమంటూ చేతులెత్తేసిన పోలీసులు

Two Young girls married each other in Rajasthan

  • రాజస్థాన్‌లోని రతన్‌గఢ్‌లో ఘటన
  • సోదరిని చూసేందుకు వచ్చి ఆమె ఆడపడుచుతో ప్రేమాయణం
  • పెళ్లి చేసుకుని రెండు నెలలుగా కాపురం

ఇద్దరు యువతుల మధ్య చిగురించిన స్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఆపై విడివిడిగా ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఇంట్లోంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌గఢ్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన యువతికి రతన్‌గఢ్‌కు చెందిన యువతితో వివాహమైంది. సోదరిని చూసి వెళ్లేందుకని ఏడాది క్రితం ఆమె చెల్లెలు (22) రతన్‌గఢ్ వచ్చింది. ఈ క్రమంలో సోదరి ఆడపడుచు (18)తో పరిచయం ఏర్పడింది. అది మరింత బలపడి ప్రేమగా మారింది.

విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు. అయినప్పటికీ వారి మధ్య చిగురించిన ప్రేమను తుంచలేకపోయారు. ఈ క్రమంలో గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఒక రోజు నేరుగా హర్యానా చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. అనంతరం వారిద్దరూ ఫతేబాద్ చేరుకుని వివాహం చేసుకున్నారు.

మరోవైపు, కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడిన రతన్‌గఢ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 12న యువతులిద్దరినీ గుర్తించారు. వివాహం అనంతరం రెండు నెలలుగా వారిద్దరూ జింద్‌లో కాపురం చేస్తున్నట్టు తెలుసుకున్నారు.

నిర్ణయం మార్చుకుని తిరిగి ఇంటికి రావాలని యువతిని తల్లిదండ్రులు బతిమాలారు. పోలీసులు కూడా వారికి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని చెప్పడంతో కుటుంబ సభ్యులు వచ్చిన దారినే ఇంటికి వెళ్లారు.

Rajasthan
Haryana
Love
Young Girls
Lesbian wedding
  • Loading...

More Telugu News