Telangana: పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు.. ప్రజలే ఉరికించి కొడతారు: బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు
- దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ పై చేయి వేయాలంటూ ఎర్రబెల్లి సవాల్
- రైతులపై కేంద్రం కక్షసాధింపులు
- ఎరువుల ధరలను భారీగా పెంచారు
- కేంద్రం దిగొచ్చి ధరలను తగ్గించాలన్న మంత్రి
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అరెస్ట్ చేయిస్తామని ఒకరు.. జైలుకు పంపిస్తామంటూ ఇంకొకరు.. పిచ్చికుక్కల్లాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ లపై చెయ్యి వేసి చూడాలని సవాల్ విసిరారు. ప్రజలే ఉరికించి కొడతారంటూ మండిపడ్డారు.
ఇవాళ మంత్రి ఎర్రబెల్లి టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఎరువుల ధరలను విపరీతంగా పెంచారని, గత ఏడాది రూ.1,040గా ఉన్న భాస్వరం ధరను ఇప్పుడు రూ.700 పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, పెట్రోల్, డీజిల్ ధరలనూ కేంద్రం భారీగా పెంచిందన్నారు. ఎరువుల విషయంలో బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం దిగి వచ్చి పెంచిన ధరలను తగ్గించాలని, ప్రతి పంటకూ గిట్టుబాటు ధరను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, ఒకప్పుడు రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపట్ల కాంగ్రెస్ పై రేవంత్ విమర్శలు చేశారని గుర్తు చేశారు. అసలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎవరి వల్ల నష్టం జరిగిందంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఎడారి కావడానికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఏం చేసిందో చర్చకు కేటీఆర్ సిద్ధమని ఎర్రబెల్లి అన్నారు.