Congress: ఉన్నావో రేప్ బాధితురాలి తల్లిని బరిలో నిలిపిన కాంగ్రెస్

Congress Announces Unnao Rape Victim Mother Name For Elections

  • యూపీ ఎన్నికలకు 125 మందితో తొలి జాబితా ప్రకటన
  • ఆశాసింగ్ కు టికెట్ ఇస్తున్నట్టు ప్రియాంక గాంధీ వెల్లడి
  • గోండు ఉద్యమ కారుడు రామ్ రాజ్ గోండ్ కూ అవకాశం
  • ఆశా కార్యకర్త పూనమ్ పాండేకి కూడా టికెట్
  • 50 మంది మహిళలకు అవకాశం

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో లో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన గుర్తుందా? ఆ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే, తాజాగా ఉన్నావో రేప్ బాధితురాలి తల్లిని యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. 125 మందితో ఇవాళ వెల్లడించిన తొలి జాబితాలో ఆమె పేరునూ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఆశాసింగ్ ను ఎన్నికల బరిలో దించుతున్నామని ఆమె చెప్పారు.

ఇక, ఆమెతో పాటు గోండు గిరిజనుల కోసం సోన్ భద్రలోని ఉంభా గ్రామంలో ఉన్న భూ సమస్యపై న్యాయపోరాటం చేస్తున్న రామ్ రాజ్ గోండ్ కూ టికెట్ ఇచ్చినట్టు తెలిపారు. గత ఏడాది నవంబర్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు వచ్చి, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న ఆశా వర్కర్ పూనమ్ పాండేకీ టికెట్ ఇచ్చామని పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లలో జైలుపాలైన కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ కూ టికెట్ ఇచ్చినట్టు చెప్పారు.

తొలి జాబితాలో 50 మంది (40%) మహిళలకు చోటిచ్చారు. మొత్తంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో 40 శాతం యువతే కావడం విశేషం. కాగా, ఉన్నావో రేప్ బాధితురాలి తల్లికి టికెట్ ఇవ్వడం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ చేతిలో ఎవరి బిడ్డయితే అన్యాయానికి గురైందో.. ఆమె ఇప్పుడూ న్యాయానికి ప్రతినిధిలా నిలబడతారని ట్వీట్ చేశారు. ‘పోరాడుతాం.. గెలుస్తాం’ అని పేర్కొన్నారు.  

ఇదీ ఉన్నావో రేప్ ఉదంతం..

2017లో దళిత బాలికపై నాటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ సీఎం యోగి ఇంటి ముందు అత్యాచార బాధితురాలు ఆత్మాహుతికి యత్నించడంతో సంచలనంగా మారింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన కుల్దీప్ సెంగార్.. బాధితురాలి తండ్రిని ఆయుధాల కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అతడు కొన్ని రోజులకే చనిపోయాడు. దీంతో వివాదం మరింత ముదిరింది.

2019లో లాయర్, ఇతర బంధువులతో కలిసి బాధితురాలు రాయ్ బరేలిలోని తన బాబాయి ఇంటికి వెళుతున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఆ రోడ్డు ప్రమాదంలో లాయర్ సహా ముగ్గురు చనిపోయారు. తీవ్రగాయాలైన ఆమెను లక్నోలోని ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు హెలికాప్టర్ లో తీసుకొచ్చారు. కుల్దీప్ సెంగారే తనను చంపించేందుకు ఈ యాక్సిడెంట్ చేయించాడని ఆమె అప్పట్లో వాంగ్మూలం కూడా ఇచ్చింది.

అయితే, దానికి ఆధారాల్లేవని కొట్టిపారేసిన ఢిల్లీ కోర్టు.. అత్యాచారం, బాధితురాలి తండ్రి మరణం కేసుల్లో 2020లో సెంగార్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News