Tollywood: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. పాక్ లోనూ ‘అఖండ’ చెలరేగుతోందంటూ కామెంట్.. ఇదిగో వీడియో
- హైదరాబాద్ లో సినిమా విజయోత్సవ సభ
- టికెట్ల ధరలపై ఇండస్ట్రీ నిర్ణయానికి కట్టుబడతామన్న బాలయ్య
- అందరం కలసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడి
- అఖండ గురించి పాక్ నుంచీ వీడియోలు వస్తున్నాయన్న బాలకృష్ణ
ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కడ సినిమాగోడును పట్టించుకునే వారు లేరని, వినిపించుకునే నాథుడు లేడని అన్నారు. సినిమా టికెట్ల విషయంపై చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ వివాదంపై పరిశ్రమ కలసికట్టుగా ఉండాలని సూచించారు.
అందరూ కలిసి చర్చించుకుని తమ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ముందు పెడతామన్నారు. దీనిపై తానొక్కడిని మాట్లాడితే సరిపోదని, అందరూ కలిసి చర్చించుకోవాలని అన్నారు. తనకంటూ ఏ అభిప్రాయమూ లేదన్నారు. ఒక్కరి అభిప్రాయంతో పనిజరగదని, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఇతర వర్గాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు.
హైదరాబాద్ లో ‘అఖండ సంక్రాంతి సంబరాలు’ పేరిట నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ లోనూ అఖండ చెలరేగిపోతోందని, అక్కడి నుంచి కూడా వీడియోలు వస్తున్నాయని చెప్పారు. అన్ సీజన్ లో రిలీజైన ఈ సినిమాను.. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఆదరిస్తున్నారని చెప్పారు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది మారిందన్నారు.
థియేటర్లకు జనం వస్తారా? రారా? అన్న సందిగ్ధంలోనూ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధైర్యంగా సినిమాను విడుదల చేశారన్నారు. ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచే సంక్రాంతి పండుగ వచ్చేసిందన్నారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలూ బాగా ఆడాలని ఆయన కోరుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై ప్రశంసలు కురిపించారు. ఆయన భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడే డైరెక్టర్ అని అన్నారు.