Perni Nani: సినిమా టికెట్ల విషయాన్ని పక్కనపెట్టి, అవసరమైన విషయాలపై స్పందిస్తే మంచిది: మంత్రి పేర్ని నాని

AP Minister Perni Nani Fires on Media
  • ఎన్టీఆర్ టు వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బండ్లలాగుడు పోటీలు
  • బహుమతులు అందజేసిన మంత్రి పేర్నినాని
  • ప్రజలకు పనికొచ్చే విషయాలపై మీడియా దృష్టి సారించాలన్న మంత్రి
మీడియా సినిమా టికెట్ల విషయాన్ని పట్టుకుని వేలాడడం మాని, సమాజానికి పనికొచ్చే విషయాలపై దృష్టి సారిస్తే మేలని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ లింగవరం రోడ్డులోని కె.కన్వెన్షన్ ఆవరణలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లలాగుడు పోటీలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి పోటీల విజేతలకు మంత్రి పేర్ని నాని బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రుల పేర్లతో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పశుసంపద, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా మంత్రి కొడాలి నాని సోదరులు గత ఐదు సంవత్సరాలుగా పోటీలు నిర్వహిస్తుండడం ప్రశంసనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఏపీలో వివాదాస్పదమైన సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రిని ప్రశ్నించగా, మీడియా ఈ విషయాన్ని వదిలేసి, అవసరమైన విషయాలపై స్పందిస్తే సమాజానికి మంచిదని హితవు పలికారు. సినిమా టికెట్ల అంశం తప్ప స్పందించేందుకు మీడియాకు మరే అంశమే లేదా? అని ప్రశ్నించారు. 
Perni Nani
Movie Tickets
Media

More Telugu News