Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక.. హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్
- మృతుడు రూప్ కిశోర్ సింగ్ కర్నూలు వాసి
- జీయూఎస్ ఎడ్యుకేషన్ ఇండియా కంపెనీలో పని చేస్తున్న మృతుడు
- ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్
పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రూప్ కిశోర్ సింగ్ (30) మదాపూర్ లోని జీయూఎస్ ఎడ్యుకేషన్ ఇండియా కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ సింగ్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆయన చిన్న కుమారుడు రూప్ కిశోర్ సింగ్.
కొండాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంటులో ఆయన ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడు. అయితే నిన్న తెల్లవారుజామున 2.45 గంటలకు తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. తనకు పని ఒత్తిడి ఎక్కువయిందని... ఇక బతకాలనిపించడం లేదని మెసేజ్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన కుటుంబసభ్యులు అతని స్నేహితుడు వేణుగోపాల్ కు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే కిశోర్ ఉంటున్న ఫ్లాట్ కు వేణుగోపాల్ వెళ్లాడు. అయితే, తలుపు వేసి ఉండటంతో వాచ్ మెన్ సహాయంతో తలుపులు తీసి చూడగా కిశోర్ ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు షాక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.