CM KCR: కరోనాపై భయాందోళనలకు గురికావొద్దు: సీఎం కేసీఆర్
- తెలంగాణలో కరోనా విజృంభణ
- ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష
- సంక్రాంతి ఇళ్లలోనే జరుపుకోవాలని సూచన
- ప్రజలు గుమికూడవద్దని హితవు
- వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూ స్పష్టీకరణ
తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి కరోనా ఉద్ధృతమవుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనాపై భయాందోళనలకు గురికావొద్దని ప్రజలకు సూచించారు. అయితే, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని స్పష్టంచేశారు.
సంక్రాంతి పండుగ వస్తోందని, ప్రజలు గుమికూడవద్దని, ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించాలని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు (15 నుంచి 18 సంవత్సరాలు) కరోనా వ్యాక్సిన్ వేయించాలని పిలుపునిచ్చారు. రేపటి నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.