Telangana: పండుగ వేళ అదనపు చార్జీల్లేకుండా 4,322 స్పెషల్ బస్సులు.. టీఎస్ఆర్టీసీ ప్రకటన

TSRTC To Run 4322 Special Buses Across Two States

  • ఏపీకి 984 బస్సులు నడుస్తాయన్న ఎండీ సజ్జనార్
  • తెలంగాణలో తిరగనున్న 3,338 బస్సులు
  • 200 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం
  • హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటన
  • 6,970 స్పెషల్ బస్సులను నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ

సంక్రాంతి పండుగవేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలను వసూలు చేయబోమని ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు 4,322 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. తెలంగాణలో 3,338, ఏపీకి 984 స్పెషల్ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. జనవరి 14 వరకు ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు.ఈ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

స్పెషల్ బస్సులతో పాటు ఎంజీబీఎస్ నుంచి 3,400, జేబీఎస్ నుంచి 1,200 రెగ్యులర్ బస్సులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. బస్సుల నిర్వహణకు 200 మంది ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. బస్సుల గురించి సమాచారం రెండు హెల్ప్ లైన్ నెంబర్లను ఆయన ప్రకటించారు. ఎంజీబీఎస్ కు 9959226257, జేబీఎస్ కు 9959226246 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు.

కాగా, ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, మియాపూర్ ఎక్స్ రోడ్స్, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, జీడిమెట్ల, ఉప్పల్ ఎక్స్ రోడ్స్, ఎల్బీ నగర్ లలో ప్రత్యేక అధికారులను టీఎస్ ఆర్టీసీ నియమించింది. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా 6,970 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించింది. జనవరి 7 నుంచి 18 వరకు ఈ బస్సులు నడవనున్నాయి. అయితే, రెగ్యులర్ చార్జీలకన్నా 50 శాతం ఎక్కువగా వసూలు చేయనున్నారు. ఓ వైపు ఖాళీగా వెళ్లాల్సిన నేపథ్యంలోనే అదనపు చార్జీలను వసూలు చేస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ డి. తిరుమలరావు పేర్కొన్నారు. ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News