Pakistan: పాకిస్థాన్‌లో ముర్రేలో భారీ హిమపాతం.. రాత్రంతా వాహనాల్లో చిక్కుకుని 22 మంది పర్యాటకుల మృతి

22 people die trapped in vehicles after heavy snowfall in Pakistans Murree

  • పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న ముర్రే
  • ప్రతి శీతాకాలంలో వేలాది మంది పర్యాటకుల రాక
  • మృతుల్లో 10 మంది చిన్నారులు.. పోలీసు అధికారి కుటుంబం
  • ముర్రే వెళ్లే అన్ని దారులను మూసేసిన ప్రభుత్వం
  • రహదారులపై చిక్కుకుపోయిన వందలాది మంది

పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రేలో 22 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భారీ హిమపాతం కారణంగా పర్యాటకుల వాహనాలు మంచులో కప్పబడిపోయాయి. రాత్రంతా వారి వాహనాలపై మంచు కురవడంతో ఊపిరి ఆడక వారంతా మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముర్రేలో అత్యవసర పరిస్థితి విధించింది. ముర్రేకు వెళ్లే అన్ని దారులను మూసివేసింది. మృతుల్లో పదిమంది చిన్నారులు, రాజధాని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి నవీద్ ఇక్బాల్‌తోపాటు ఆయన కుటుంబ సబ్యులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాహనాల్లో చిక్కుకుపోయిన వీరంతా హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం) బారినపడి ఊపిరి ఆడక మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.  ఈ ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ పర్యాటక ప్రదేశం ఇస్లామాబాద్‌కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సందర్శించేందుకు ప్రతి ఏడాది శీతాకాలంలో వేలాదిమంది సందర్శకులు తరలివస్తుంటారు. ఈసారి ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. మరోవైపు, ముర్రేకు వెళ్లే అన్ని దారులను ప్రభుత్వం మూసివేయడంతో 1,122 మంది ప్రయాణికులు రోడ్డుపై చిక్కుకుపోయారు. వీరికి స్థానికులు ఆహారం, దుప్పట్లు అందిస్తూ చేతనైన సాయం అందిస్తున్నారు. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది.

  • Loading...

More Telugu News