AIIMS Doctor: ఒమిక్రాన్ ను లైట్ గా తీసుకోవద్దు: కరోనాకు గురైన ఎయిమ్స్ డాక్టర్ తన్మయ్ మోతీవాలా

Dont Take Omicron Lightly says doctor

  • ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వారికి స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి
  • వీరు ప్రమాదం నుంచి బయటపడతారు
  • కానీ వీరి వల్ల వారి సన్నిహితులకు, ఇతరులకు వైరస్ సోకుతుంది

దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మరోవైపు డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరం కాదంటూ పలువురు వైద్య నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఒమిక్రాన్ ను ఏమాత్రం లైట్ గా తీసుకోవద్దని డాక్టర్ తన్మయ్ మోతీవాలా హెచ్చరించారు. జోధ్ పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన పిల్లల విభాగంలో డాక్టర్ గా పని చేస్తున్నారు. గత బుధవారం ఆయన కరోనా బారిన పడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన వర్చువల్ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
 
'ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత నాకు కొంచెం తలనొప్పి వచ్చింది. ఆ తర్వాత శరీరం బలహీనంగా అనిపించింది. ఇది స్పష్టమైన లక్షణం. వెంటనే నేను సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాను. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ గా నేను సేవలందిస్తూనే ఉన్నా. గతంలో కూడా డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అయితే ఈసారి కరోనా బారిన పడుతున్న డాక్టర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మొత్తం డిపార్ట్ మెంట్ కు కరోనా సోకుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం.

రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవారికి తక్కువ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి వారు ఇతరులకు హానికరంగా మారతారు. రోగ నిరోధకశక్తి ఎక్కువ ఉన్నవారు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు... కానీ వారి సన్నిహితులకు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి వారు ప్రమాదకరంగా మారుతారు. వీరి వల్ల వారికి వైరస్ సోకుతుంది.

ఇక డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కు మధ్య తేడాను గుర్తించడం కష్టం. కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరితే... రెగ్యులర్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. అందరూ ఇంటి వద్దే ఉంటూ, మాస్కును ధరించడం ఒక్కటే మనకు శ్రీరామ రక్ష. వీటిని పాటించిన వారే హీరోలు అవుతారు' అంటూ డాక్టర్ తన్మయ్ చెప్పారు.

  • Loading...

More Telugu News