Vanama Raghava: ఈ రాఘవ మామూలోడు కాదు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు!

There are so many allegations on vanama raghava son of MLA Vanama

  • టీడీపీ కార్యకర్త హత్య కేసులోనూ ఆరోపణలు
  • మరో వ్యక్తి ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడిగా రాఘవ
  • బాధితుడిపైనే కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు
  • 42 మంది పేర్లు రాసి బాధితుడి ఆత్మహత్య

పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా తనయుడు వనమా రాఘవేంద్ర దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ కార్యకర్త హత్య, మరో వ్యక్తి ఆత్మహత్య కేసులోనూ అతడి ప్రమేయం ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పాత పాల్వంచకు చెందిన చెర్ల చిట్టెయ్య పట్టణంలోని స్పాంజ్ ఐరన్ కంపెనీలో పనిచేసేవాడు. అప్పట్లో అతడు టీడీపీలో క్రీయాశీలకంగా ఉండేవాడు. ఈ క్రమంలో 1993లో పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్‌టీయూసీని బలపరిచాడు. అయితే, ఐఎన్‌టీయూసీకి మద్దతివ్వాలంటూ రాఘవ ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి ఆయన నిరాకరించాడు.

ఆ తర్వాత ఒక రోజు విధులకు వెళ్లిన చిట్టెయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. కొన్ని రోజులకు గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు లభ్యమయ్యాయి. అవి చిట్టెయ్యవేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. చిట్టెయ్య హత్యలో రాఘవనే నిందితుడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదేళ్లపాటు జరిగిన ఈ విచారణలో సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఈ కేసును కొట్టేసింది.

మరో ఘటనలో పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు బొల్లోరిగూడెంలోని ఓ వ్యక్తి వద్ద రూ. 25 లక్షల చిట్టీలు రెండు వేశాడు. గడువు ముగిసినప్పటికీ నిర్వాహకుడు చిట్టీ డబ్బులు రూ. 50 లక్షలు చెల్లించలేదు. ఒత్తిడి తీసుకురావడంతో ఓ ప్లాటు రాసిచ్చాడు.

అయితే, అదే ప్లాటును సత్తుపల్లికి చెందిన ఓ కానిస్టేబుల్‌కి కూడా విక్రయించాడు. విషయం తెలిసిన వెంకటేశ్వరరావు.. రాఘవను ఆశ్రయించాడు. న్యాయం చేస్తానని చెప్పిన రాఘవ రూ. 10 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసిన చిట్టీ నిర్వాహకుడు అంతకు రెట్టింపు ఇస్తానని చెప్పడంతో రాఘవ ఆ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడాడు.

దీంతో ఏం చేయాలో పాలుపోని వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. అయినా, ఫలితం లేకపోగా తిరిగి ఆయనపైనే కేసు పెట్టి 14 రోజులు రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత బెయిలుపై వచ్చిన  బాధితుడు తన ఆత్మహత్యకు 42 మంది కారకులంటూ వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిట్టీ నిర్వాహకుడిని ఏ1గా, రాఘవను ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ విచారించలేదని వెంకటేశ్వరరావు భార్య శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News