MAA: ఏపీ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురూ
- ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటన
- కరోనా విజృంభణ వల్ల ఆలస్యంగా ఎన్నికలు
- 'మా'లో 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు
ఆంధ్రప్రదేశ్ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా చెబుతూ, వివరాలు వెల్లడించారు. కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా నటి కవిత, ప్రధాన కార్యదర్శిగా నరసింహరాజు, కార్యదర్శిగా అన్నపూర్ణ పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ వల్ల ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని తెలిపారు.
24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు తమ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. పోటీ చేసేవారు దరఖాస్తులను 'మా' ఏపీ కార్యాలయానికి పంపవచ్చని, ఎన్నికల తేదీని మార్చి 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రజరర్, ఈసీ మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం నిబంధనల మేరకు ఏపీలో 2018లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాలతో ఏర్పాటు చేశారు. ఈ యూనియన్‌ను ఏపీ ప్రభుత్వం హెచ్-196 నంబర్ తో 2018 ఫిబ్రవరి, 14న ఆమోదించింది.