bmw ix flow: బటన్ నొక్కితే కారు రంగు మారిపోతుంది: బీఎండబ్ల్యూ సరికొత్త కాన్సెప్ట్
- బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ఆవిష్కరణ
- ఎలక్ట్రో ఫోరెటిక్ టెక్నాలజీ వినియోగం
- నలుపు, తెలుపు రంగులకు మార్చుకోవచ్చు
డ్యాష్ బోర్డులో ఒక్క బటన్ నొక్కగానే సెకండ్ల వ్యవధిలో కారు రంగు మారిపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉండదూ! జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇలాంటి వినూత్నమైన కాన్సెప్ట్ కారును తీసుకొచ్చింది. రంగులు మార్చుకునే ఊసరవెల్లి మాదిరిగానే ఈ కారు కూడా త్వరలో రోడ్లపై దర్వనమివ్వనుంది.
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో అనేది ఈ కారుకు పెట్టిన పేరు. ఇందులో ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీని వినియోగించారు. రంగులు మార్చే కిటుకు ఇందులోనే ఉంటుంది. ఇది గ్రాఫిక్స్ తో కూడిన టెక్నాలజీ. నచ్చిన రంగులోకి మారే అవకాశం లేదు కానీ, బ్లాక్ నుంచి వైట్ కు లేదా కంబైన్ బ్లాక్ రంగుల్లోకి, వైట్ నుంచి బ్లాక్ కు రంగును మార్చుకోవచ్చు.
‘‘ఒక టెక్నాలజీని సృష్టించి దాన్ని కారులో అమలు చేసే ప్రయత్నం. ఆ టెక్నాలజీయే రంగు మార్చుకునేలా చేస్తుంది. అధిక వేడి ఉన్న వాతావరణంలో కారు వెళుతున్నప్పుడు నల్ల రంగు నుంచి తెలుపు రంగులోకి మారిపోతే అప్పుడు వాహనం సామర్థ్యం ఇనుమడిస్తుంది. కారు లోపల సమతుల ఉష్ణోగ్రతకు సాయపడుతుంది’’అని బీఎండబ్ల్యూ గ్రూపు వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోటే తెలిపారు.