RRR: ‘ఆర్ఆర్ఆర్’కు మరో ఆటంకం... విడుదల ఆపాలంటూ హైకోర్టులో మహిళ పిల్!

PIL filed in TS High Court requesting to stay release of RRR movie

  • అల్లూరి, కొమురం భీమ్ లను అవమానించేలా సినిమా తీశారని పిల్
  • చరిత్రను వక్రీకరించేలా తెరకెక్కించారని అభ్యంతరం
  • సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోర్టుకు విన్నపం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'కు కష్టాలు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఈ చిత్రం విడుదలపై తీవ్ర ప్రభావం చూపింది. థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి అంటూ పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు ఈ సినిమా వసూళ్లను భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతోపాటు ఏపీలో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం ఈ చిత్రానికి మరో షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, రేపు (జనవరి 7) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

మరోవైపు ఈ సినిమాకు తాజాగా మరో షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలయింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరంకు చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిల్ వేశారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను అవమానించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తన పిటిషన్ లో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ వీరుల అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. నిజమైన వీరుల చరిత్రను వక్రీకరించేలా సినిమాను తీశారని కోర్టుకు తెలిపారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోరారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

  • Loading...

More Telugu News