Chandrababu: పార్టీ తరఫున ఏం చేసినా ఈ ఏడాదే చేయాలి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- ఆందోళనలు మొదలు పెట్టండి
- వచ్చే ఏడాది ఎన్టీఆర్ శత జయంతి
- వచ్చే ఏడాది నుంచే ఎన్నికల హడావుడి
- ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం
- అన్ని నియోజక వర్గాల్లో నిరసనలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రభుత్వం ఎవ్వరినీ వదిలి పెట్టకుండా వేధిస్తోందని ఆరోపించారు. బాధితుల తరఫున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
స్థానికంగా వైసీపీ నేతలు పాల్పడుతోన్న మోసాలను ఎండగట్టాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతలు చేస్తోన్న తప్పులను ప్రజలకు వివరించి చెప్పాలని తెలిపారు. టీడీపీ తరఫున నియోజక వర్గాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
మహానాడు నిర్వహించే వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం జరపాలని ఆయన సూచించారు. ఈ నెల 18న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. టీడీపీకి ఈ ఏడాది చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. పార్టీ తరఫున ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని అన్నారు.
వచ్చే ఏడాది ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. నాయకులు ధైర్యంగా లేకుంటే కార్యకర్తలు కూడా డీలా పడతారని ఆయన చెప్పారు. ప్రజలకు ద్రోహం చేస్తోన్న నేతల తీరును ఎండగట్టాలని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు.
తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పటికీ అమ్మ క్యాంటీన్లు వంటివి కొనసాగిస్తున్నాయని, మన రాష్ట్రంలో మాత్రం పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లను తీసేశారని విమర్శించారు. అలాగే, పేదలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు అన్ని అంశాలపై ప్రణాళికలు వేసుకుని పోరాడాలని సూచించారు. నియోజక వర్గాల్లో పోరాడకుంటే ఫలితాలు ఉండబోవని చెప్పారు. ఈ ఏడాది అయిపోతే తదుపరి ఏడాది నుంచి ఎన్నికల హడావుడి మొదలవుతుందని తెలిపారు. ఏపీలో అప్పు రూ.7 లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు అన్నారు. చెత్తమీద పన్ను వేస్తోన్న చెత్త ప్రభుత్వం ఏపీలో ఉందని చెప్పారు.