Cricket: సిరాజ్ గాయం కూడా అలాంటిదే అని అనుకుంటున్నా: అశ్విన్
- గాయంపై అశ్విన్ క్లారిటీ
- సిరాజ్ మళ్లీ త్వరగా జట్టులోకి వస్తాడు
- మునుపటిలాగానే అదరగొడతాడు
వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో అతడు బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో మధ్యలోనే అతడు మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.
దానిపై మ్యాచ్ అనంతరం టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. గాయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘‘సిరాజ్ గురించి మాట్లాడాలా? వద్దా? అని ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చేముందు నా మేనేజర్ ఆనంద్ ను అడిగా. మాట్లాడొచ్చంటూ అతడు చెప్పాడు. దీంతో సిరాజ్ గాయం గురించి మాట్లాడుతున్నా.
అయినా ఇప్పుడే సిరాజ్ గాయం గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుంది. గాయం అయిన వెంటనే ఫిజియోలు ఐస్ రుద్ది, ఆ తర్వాత ఓ రెండు గంటల పాటు చూస్తారు. సిరాజ్ గాయం కూడా అలాంటిదే అని నేను అనుకుంటున్నా. సిరాజ్ గతంలో లాగే మళ్లీ మైదానంలోకి వెంటనే అడుగుపెట్టి, అదరగొడతాడని ఆశిస్తున్నా’’ అంటూ చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు తక్కువేనని అన్నాడు. అయినా జట్టు గట్టి పోటీనే ఇస్తుందని తెలిపాడు. సౌతాఫ్రికా పిచ్ లపై ఏ స్కోరైనా కష్టమేనని, అయితే 250 చేస్తే మంచి స్కోరని అన్నాడు.