gold imports: బంగారం ధగధగ.. 2021లో రెట్టింపు స్థాయిలో దిగుమతులు
- 2021లో 1050 టన్నుల బంగారం దిగుమతి
- విలువ పరంగా చూస్తే 55.7 బిలియన్ డాలర్లు
- 2020లో దిగుమతి 430 టన్నులే
- ధరలు తగ్గడంతో పెరిగిన కొనుగోళ్లు
2021లో రికార్డు స్థాయిలో బంగారం దేశంలోకి దిగుమతి అయింది. అలంకరణకే కాకుండా పెట్టుబడులకు అనుకూల సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుండడం బంగారానికి డిమాండ్ ను అధికం చేస్తోంది. విలువ పరంగా చూస్తే 55.7 బిలియన్ డాలర్ల (రూ.4.47 లక్షల కోట్లు) పసిడి గతేడాది దిగుమతి అయింది. 2020లో నమోదైన 22 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
పరిమాణం పరంగా చూస్తే 1,050 టన్నుల బంగారం 2021లో దిగుమతి అయింది. 2020లో ఇది 430 టన్నులుగానే ఉంది. గత రెండేళ్లు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రజలు ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం తెలిసిందే. ఆర్థిక అనిశ్చితుల్లో సహజంగానే బంగారం ధరలకు రెక్కలు వస్తుంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాలైన బంగారం వంటి వాటికి అధిక వెయిటేజీ ఇస్తుంటారు.
‘‘గతేడాది బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. 2020లో కరోనా కారణంగా పెళ్లిళ్లు 2021కు వాయిదా పడ్డాయి. దీంతో వివాహాలకు సంబంధించి కూడా ఆభరణాల వినియోగం పెరిగింది’’ అని హోల్ సేల్ బంగారం వ్యాపారి ఒకరు తెలిపారు. ధరలు తగ్గడంతో చాలా మందికి ఆకర్షణీయంగా కనిపించిందని, కొనుగోళ్లు పెరిగేందుకు అనుకూలించినట్టు చెప్పారు. 2020లో ఆగస్ట్ లో 10 గ్రాముల ధర రూ.56,000కు పైగా వెళ్లగా, అక్కడి నుంచి 2021 మార్చి నాటికి రూ.43,000కు దిగి రావడం గమనార్హం.