Karnataka: ముఖ్యమంత్రి సమక్షంలోనే... స్టేజీపై కొట్టుకున్నంత పనిచేసిన బీజేపీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ

BJP Minister and Congress MP Almost Come to Blows

  • కర్ణాటకలోని రామనగరలో ఘటన
  • నిన్న అంబేద్కర్, కెంపెగౌడల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం బొమ్మై
  • ఎంపీ డి.కె. సురేశ్ పై మంత్రి అశ్వంత్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఇద్దరి మధ్యా వాగ్వివాదం.. మీదమీదకు వెళ్లిన సురేశ్
  • అడ్డుకున్న భద్రతా సిబ్బంది, తోటి ప్రజాప్రతినిధులు

బీజేపీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. స్టేజీపైనే అందరూ చూస్తుండగా పోట్లాడుకున్నారు. కర్ణాటకలో నిన్న జరిగిందీ ఘటన. రామనగరలో బి.ఆర్. అంబేద్కర్, కెంపెగౌడల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మంత్రి సి.ఎన్. అశ్వంత్ నారాయణ్, కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అశ్వంత్ నారాయణ్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకే బీజేపీ ప్రభుత్వం ఇక్కడకు వచ్చిందని, వారిని మోసం చేసేందుకు కాదని అన్నారు.

మంత్రి నారాయణ ప్రసంగిస్తున్న సమయంలో ఎంపీ సురేష్ ను కించపరిచేలా కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనే నారాయణ కూడా స్టేజ్ మీద నుంచి చేయడంతో సురేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నారాయణ మీదకు వెళ్లారు. మైకును లాక్కోబోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చెలరేగింది. దాదాపు కొట్టుకునేంత పనిచేశారిద్దరు. భద్రతా సిబ్బంది, ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

ఘర్షణ అనంతరం సురేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎస్. రవి సహా ఆ పార్టీ నేతలు స్టేజీపైనే నిరసనకు దిగారు. కార్యక్రమం తర్వాత మంత్రి అశ్వంత్ పోస్టర్లు, బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు చించేశారు. ఇక వారిద్దరి ఘర్షణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Karnataka
BJP
Congress
DK Suresh
Ashwanth Narayan
  • Loading...

More Telugu News