GitHub: 'బుల్లీ బాయ్' యాప్ వివాదం... యూజర్ అకౌంట్ ను నిలిపివేసిన గిట్ హబ్
- యాప్ లో వందల కొద్దీ ముస్లిం మహిళల ఫొటోలు
- మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ ప్రచారం
- గిట్ హబ్ వేదికగా బుల్లీ బాయ్ యాప్ కార్యకలాపాలు
- యాప్ ను బ్లాక్ చేసినట్టు గిట్ హబ్ ప్రకటన
కొందరు ముస్లిం మహిళల ఫొటోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసి, వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తున్న బుల్లీ బాయ్ అనే యాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ఆ యాప్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం గిట్ హబ్ వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. ఈ అంశం గిట్ హబ్ నిర్వాహకుల దృష్టికి కూడా వెళ్లింది. దాంతో బుల్లీ బాయ్ అకౌంట్ ను సస్పెండ్ చేశారు.
దీనిపై గిట్ హబ్ స్పందిస్తూ... వేధింపులు, వివక్ష, హింస తదితర అంశాలకు సంబంధించి తమకు స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై పరిశీలన జరిపి, ఓ యూజర్ అకౌంట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించామని, తగిన చర్యలు తీసుకున్నామని వివరించింది. చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తే, వారికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గిట్ హబ్ ప్రతినిధి వెల్లడించారు.
కాగా, ఈ వివాదంలో ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ నుంచి కూడా సమాచారం కోరుతున్నారు. సదరు బుల్లీ బాయ్ యాప్ నుంచి వచ్చిన ట్వీట్ ఈ దుమారం రేపినట్టు తెలుస్తోంది. అటు, గిట్ హబ్ నుంచి కూడా వివరణ కోరారు. బుల్లీ బాయ్ యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు దర్శనమివ్వడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో ముస్లిం మహిళల ఖాతాల నుంచి వారి ఫొటోలను సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు వాటిని బుల్లీ బాయ్ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై ప్రకటనలు రావడం సంచలనం సృష్టించింది.
మహారాష్ట్రకు చెందిన మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ యాప్ వ్యవహారాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కు నివేదించారు. అటు ప్రియాంక చతుర్వేదితో పాటు ఇస్మాత్ ఆరా అనే పాత్రికేయురాలు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ అంశంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ... 'బుల్లీ బాయ్' యాప్ ను గిట్ హబ్ నిలిపివేసిందని తెలిపారు. గిట్ హబ్ ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన అనుబంధ సంస్థ.