Cardelia Cruise Ship: కార్డీలియా క్రూయిజ్ నౌకలో కరోనా కలకలం... 66 మందికి పాజిటివ్

Corona positive cases in Cardelia cruise liner

  • ముంబయి నుంచి గోవా వచ్చిన క్రూయిజ్ షిప్
  • నౌకలో 2 వేల మంది
  • అందరికీ కరోనా టెస్టులు చేసిన గోవా సర్కారు
  • ప్రయాణికులు నౌకను వీడరాదని ఆదేశాలు

భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబయి నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కార్డీలియా నౌకలో ప్రయాణిస్తున్న 2 వేల మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు.

నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నౌకలో ప్రత్యేక ప్యాకేజీతో ప్రయాణ సౌకర్యం కల్పించారు. అయితే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణ కావడంతో, నౌకలోని ప్రయాణికులు ఎవరూ బయటికి రావొద్దని ఆదేశించారు. వారు నౌకను వీడడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.

కార్డీలియా క్రూయిజ్ షిప్ పేరు ఇటీవల వరకు మీడియాలో మార్మోగడం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు, మరికొందరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా, ఆనాడు రేవ్ పార్టీకి ఈ నౌకే వేదికగా నిలిచింది.

అటు, ముంబయిలో కరోనా కేసులు అధికమవుతుండడంతో బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలో పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు ఉంటాయని తెలిపింది.

Cardelia Cruise Ship
Corona
Positive Cases
Goa
Mumbai
  • Loading...

More Telugu News