Bandi Sanjay: బండి సంజయ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది: న్యాయవాది మృత్యుంజయం ఆరోపణ
- కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష భగ్నం
- అరెస్ట్ చేసిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
- బండి సంజయ్ పై కుట్ర జరుగుతోందన్న అడ్వొకేట్ మృత్యుంజయం
- కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపణ
కరీంనగర్ లో నిన్న జాగరణ దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తరఫు న్యాయవాది మృత్యుంజయం స్పందించారు.
బెయిల్ పిటిషన్ పై హైకోర్టుకు వెళతామని తెలిపారు. బండి సంజయ్ పై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సంజయ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ముఖ్యులు కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు.
అటు, బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందిస్తూ... బండి సంజయ్ పట్ల ప్రభుత్వ తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనే కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను త్వరలోనే ప్రజలు గద్దె దించుతారని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీజేపీ దీక్ష చేపట్టినరోజే కాంగ్రెస్ కూడా దీక్ష చేస్తుండడం అందుకు నిదర్శనం అని విజయశాంతి పేర్కొన్నారు. బండి సంజయ్ తో పాటు కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని స్పష్టం చేశారు.